రక్తం ఎందుకు గడ్డకడుతుంది ?
Published on July 29, 2012 · No Comments
మనకు రక్తం ఎంతో అవసరం. మన శరీరంలో రక్తం లేక పోతే బ్రతకటం కష్టం. అందుకే ఎక్కువ రక్తం పోయిన వారికి రక్తాన్ని ఎక్కిస్తారు. రక్తం ద్రవ రూపంలో ఉంటుంది. మన లోపల రక్తం సన్నని నాళాల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి నాళాలే తెగి పోయాయను కోండి. రక్తం ధారగా కారుతుంది.
గాయం తక్కువై చాలా చిన్నగా ఉంటుందను కోండి. రక్తం కాస్త కారగానే అక్కడ గడ్డకట్టుకు పోతుంది. గాయం పెద్దదయితేనే ప్రమాదం. గాయం దగ్గర రక్తం ఎందుకు గడ్డకడుతుంది ?
రక్తంలో ఎర్రరక్తకణాలున్నాయి. తెల్లరక్త కణాలున్నాయి. వీటితో పాటు ‘ప్లేట్‌లెట్స్’ అనే కణాలకు సంబంధించిన భాగాలు ఉన్నాయి. ఇవి రక్తంలో తేలుతూ ఉంటాయి. అలా తేలుతూ శరీరమంతా తిరుగుతూ ఉంటాయి.
”ప్లేట్‌లెట్స్” లో ”త్రాంబోకెనేస్” అనే ఎంజైములు ఉంటాయి. గాయం అయినప్పుడు రక్తం శరీరం వెలుపలికి వస్తుంది. దానితో రక్తం లో ఉన్న ‘ప్లేట్‌లెట్స్” విచ్ఛిన్నం అవు తాయి. అలా విచ్చిన్నమై, ఎంజైమును’ విడుదల చేస్తాయి. రక్తం లో ఎక్కువగా ‘ప్లాస్మా’ ఉంటుంది.
ప్లాస్మాలో వున్న ‘ప్రోత్రాంబిన్’ అనే పదార్థంతో ఎంజైమ్స్ చర్య జరుపుతాయి. అలా జరిపి కాల్షియం సహాయంతో ‘త్రాంబిన్’గా మారుస్తాయి. ఈ త్రాంబిన్ ప్లాస్మాలో ఉన్న పైబ్రినోజన్‌ను ‘ఫైబ్రిన్’ గా మారుస్తుంది. ఫైబ్రిన్ దారం పోగుల్లా ఉంటుంది. ఈ పోగులు రక్తకణాల చుట్టూ వలలాగా అల్లుకుంటాయి. అప్పుడు ఆ కణాలు గడ్డకట్టుకున్నట్టు అయి పోతాయి. దీనినే రక్తం గడ్డకట్టడం అంటారు.
No comments:
Post a Comment