అన్నాకు జనం ఓటేస్తారా?!
Published on August 3, 2012 · 4 Comments
లోక్ పాల్ డిమాండ్ తో జనాల్లోకి దూసుకొచ్చి, అవినీతి వ్యతిరేక పోరాటంతో శతకోటి భారతీయుల్లో హీరోగా ఎదిగిన సామాజిక కార్యకర్త అన్నా హాజారే తన బృందం రూపంలో రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. బహుశా రాజకీయ పార్టీ రూపంలో అన్నా హజారే రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అన్నా హజారే రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. నిజాయితీ, నిబద్దలకు నిలువెత్తు రూపమైన అన్నా హజారే ఓట్ల రూపంలో భారతీయుల మన్ననలు అందుకొంటాడా? నిన్నా మొన్న ఫేస్ బుక్ లలోనూ, ట్విటర్లలోనూ, బ్లాగుల ద్వారా అన్నాకు జై కొట్టిన సిటిబర్డ్స్, అన్నా విషయాలు ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్న గ్రామీణులు అన్నాకు అండగా నిలుస్తారా?
ఈ ప్రశ్నలకు సమాధానం వెదకడం అంత సులభం కాదు. అలాగే అసలు అన్నా హజారే ఒక పార్టీ స్థాపిస్తే…దేశ వ్యాప్తంగా దానికి ఒక రూపం లభిస్తుందా? అన్నా హజారే నీతిమంతుడే అయినా…దేశంలో ఇన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అన్నా నిర్ణయించిన క్వాలిఫికేషన్లతో అభ్యర్థులు దొరుకుతారా? ఏదో నీతిమంతుడిగా కలరింగ్ ఉన్న లోక్ సత్తా జయప్రకాశ్ ల ఒకటి రెండు నియోజకవర్గాల్లో మాత్రమే అన్నా హజారే ఫార్ములా వర్కవుటవుతుందా?
ఉదాహరణకు రాష్ట్రంలోనే తీసుకొంటే…అన్నా హజారేకు జై కొట్టని ప్రజలు, రాజకీయ నాయకులు ఉన్నారా? తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ లు కూడా ఆన్నాకు తమ మద్దతు ప్రకటించారు. మరి రేపొద్దున్నే అన్నా రాజకీయ పార్టీ ప్రకటిస్తే వీరిద్దరూ అన్నా పార్టీలో చేరతారా, లేక అన్నాహజారేనే తమ పార్టీలోకి ఆహ్వానిస్తారా? నాయకులను ఎందుకు ఉదాహరించాల్సి వచ్చిందంటే…ఇప్పుడు జగన్ , చంద్రబాబు నాయుడుల సమర్థకులు కూడా తమ నాయకుల స్థాయిలోనే ఆలోచిస్తారు. తమ నాయకుడిని అభిమానిస్తూనే అందరూ అన్నాకు మద్దతు పలికారు.
ఇక పోలింగ్ బూత్ వరకూ నడిచొచ్చి…క్యూలోనిలబడి అన్నాహజారే అభ్యర్థులకు ఓటేసేవారి సంఖ్య ఎంత ఉంటుందో కానీ, అసలు అన్నా రాజకీయ ప్రవేశం రానున్న రెండేళ్లలో మరెన్ని మలుపులు తిరుగుతుందో!
No comments:
Post a Comment