Saturday 29 December 2012

యల్లాయపాళెం పుట్టుక

 యల్లాయపాళెం పుట్టుక


ఆ రోజు వాతావరణం కొద్దిగా మబ్బులు పట్టి వుంది. ఇంట్లో వాళ్ళు వారిస్తున్నా, 'ఆ, ఈ మబ్బులు కాసేపే' అంటూ రోజూ లాగే పశువులు తోలుకుని అడవిలోకి బయలుదేరాడు. వాతావరణం బావుందేమో! తెలీకుండానే పశువులతో పాటుగా చాలా దూరం వచ్చేశాడు. దారిలో చిన్న వాగు, వాగు కి అవతల వృక్షాలు, పచ్చటి ప్రాంతం చూసి నెమ్మదిగా వాగు దాటి అక్కడికి చేరాడు. ఇక ముందుకు కదలాలనిపించలేదు. అక్కడ పశువులని మేతకి వదలి, తను కూడా తనతో పాటే తెచ్చుకున్న చద్దన్నం తిని, వాగు లోని నీళ్ళు తాగాడు. ఇక్కడ నీళ్ళకి ఇంత రుచి ఎలా వచ్చిందో అని ఆలోచిస్తూ ఓ చెట్టు కింద నిద్ర లోకి జారి పోయాడు.
ముసురు పట్టిన మబ్బు ఇంకాస్త తీవ్ర రూపం దాల్చింది. ఒక్క సారి గా పెద్ద వర్షం. దాంతో ఒక్కసారిగా నిద్రలోంచి మేల్కొన్న అతను పశువులని హడావిడి గా తోలుకుంటూ కాస్త ఎత్తైన ప్రదేశం చేరాడు. సరేలే, ఈ వాన తగ్గాక, ఇక ఇంటికి వెల్లిపోదాం అనుకుంటున్నాడు. వర్షం తగ్గక పోగా ఇంకాస్త భీకరంగా మారింది. ఈ రాత్రికి ఇక ఇక్కడే, ఒక్కడినే ఎలానో అనుకుంటూ చాలా సేపటికి నిద్ర లోకి జారుకున్నాడు. రాత్రంతా కుండపోత గా కురిసిన వాన తెల్లవారేసరికి మందగించింది.
దాంతో పశువులను తోలుకుని తిరుగుముఖం పట్టాడు. తీరా వాగు దగ్గరికి వచ్చేసరికి... నిన్నటి దాకా ప్రశాంతంగా వున్న పిల్ల వాగు ఉగ్ర నాగు లాగా వుంది. నిన్నంతా కురిసిన భారీ వర్షానికి వాగు పొంగింది. అది ఎప్పటికి తగ్గుతుందో తెలీని పరిస్ఠితి? అతనికేం తెలుసు, అక్కడే ఇంకొద్ది రోజులు గడపాలని... అలా వాగు మామూలు పరిస్ఠితి కి వచ్చేవరకు, ఆ ప్రాంతం లో నే ఫలాలు తింటూ, పశువుల పాలు తాగుతూ కొద్దిరోజులు గడిపాడు. ఆశ్చర్యకరమేమిటంటే, ఆ ప్రాంతం లో మేత తిన్నాక పశువులు అంతకుముందెన్నడూ లేనట్లు గా విపరీతంగా పాలివ్వడం ప్రారంభించాయి. అతనికి కూడా అక్కడ వున్నన్ని రోజులు తిండి కి ఇబ్బంది కాలేదు.
కొద్దిరోజుల తర్వాత తిరిగి ఇల్లు చేరిన అతను ఈ విషయాలన్నీ తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చెప్పాడు. దాంతో వారందరికీ కూడా ఆ ప్రాంతం చూడాలని అనిపించడంతో అందరూ కలిసి ఆ ప్రాంతం వచ్చి అంత మంచి ప్రాంతం వదలివెళ్ళడం ఇష్టం లేక అక్కడే స్ఠిర పడి పోయారు. ఇలా వారంతా స్థిర పడడానికి కారకుడైన 'ఎల్లయ్య' పేరుతో ఆ ప్రాంతం 'ఎల్లయ్య పాలెం' క్రమేణా 'యల్లాయపాళెం' గా ప్రసిద్ధి పొందింది.
ఇలా... యల్లాయపాళెం- కాకతీయ రాజులు , తిక్కన కాలంలో 13-14 శతాబ్దంలో ఏర్పడింది అని గ్రామస్తులు ఊరి పుట్టుక గురించి చెప్పుకునే విషయాలలో ఇది ఒకటి.

1 comment:

  1. e katha nijemena leka oohakalipitama..aa vaagu undha inka...leka kanumarugaindaa

    ReplyDelete