Wednesday, 5 December 2012

పరీక్షే!

పది, ఇంటర్ విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడుతోంది. డిసెంబరు మొదటి వారంలోపు 80 శాతం పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించాల్సి ఉంది. కానీ ఇటు ఉన్నత పాఠశాలల్లోనూ, అటు కళాశాలల్లోనూ పాఠ్యాంశాల బోధన 55 నుంచి 65 శాతానికి మించలేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఎయిడెడ్ కళాశాలల్లో అయితే ఇప్పట్లో సిలబస్ పూర్తయ్యేలా కన్పించడం లేదు. 

నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల కింద 384 ఉన్నత పాఠశాలలున్నాయి. పదో తరగతి పరీక్షలకు ఈ ఏడాది 23వేల మంది హాజరుకానున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చే సింది. పూర్తికాని సిలబస్ విద్యార్థులకు కంగారు పెట్టిస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యాంశాల బోధన పూర్తైపునశ్ఛరణ తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం సిలబస్ నత్తనడకను తలపిస్తోంది. ఈనెలాఖరులోపు పది పరీక్షల సిలబస్‌ను పూర్తి చేయాల్సి ఉండగా, నవంబరు నెలాఖరు నాటికి 65 శాతం సిలబస్ మాత్రమే పూర్తైది. మరో 24 రోజుల్లో మిగిలిన 35 శాతం సిలబస్‌ను పూర్తి చేయాల్సి ఉండటంతో విద్యార్థులు, అధ్యాపకుల్లో ఆందోళన నెలకొంది. సిలబస్‌ను విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో పూర్తి చేయకుంటే దీని ప్రభావం పది ఫలితాలపై తప్పక ఉంటుందని ఉపాధ్యాయులంటున్నారు. 

జిల్లాలోని చాలా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత..విద్యావలంటీర్లను నిమమించుకోవడంలో తాత్సారం ..కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం.. వెరసి సిలబస్‌ను అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పూర్తి చేయలేని దుస్థితి నెలకొంది. డిసెంబరు నెలాఖరులోపు పాఠ్యాంశాల బోధను పూర్తి చేసిన త్రైమాసిక, అర్థసంవత్సర పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాల్సి ఉంది. ప్రత్యేక తరగతులను నిర్వహంచకపోగా, అసలు సిలబస్‌ను పూర్తి చేయలేక అపసోపాలు పడుతున్నారు. పాఠశాలల్లో నిర్వహించాల్సిన ప్రత్యేక తరగతులు కూడా మొక్కుబడిగా సాగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 9.45 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 530 గంటల వరకు సాగాల్సిన ప్రత్యేక తరగతులు చాలా పాఠశాలల్లో కంటితుడుపుగా మారాయి. 

ఉదాహరణలివిగో
తోటపల్లి గూడూరు మండలం వరిగొండ ఉన్నత పాఠశాలలో సైన్సు టీచర్ మెడికల్ లీవ్ మీద వెళ్లారు. రెండు నెలల కిందటే విద్యావలంటీర్‌ను నియమించుకున్నారు. పాఠ్యాంశాల బోధనలో వెనుకబడి ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మనుబోలు మండలం మడమనూరు ఉన్నత పాఠశాలలో తెలుగు, బయలాజికల్ సైన్సు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా సిలబస్‌ను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఓజిలి మండలం చిల్లమానుచేను జడ్పీహెచ్‌ఎస్‌లో ఇద్దరు సోషల్ ఉపాధ్యాయులు, ఒక హిందీ ఉపాధ్యాయుని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటేషన్ మీద ఉపాధ్యాయులను నియమించినా సిలబస్ పూర్తికాలేదు. 

రాపూరు మండం ఏపినాపి ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు లేరు. ప్రధానోపాధ్యాయుడే తెలుగు పాఠాలను బోధిస్తున్నారు. 

నగరంలోని వెంకటేశ్వరపురం, మహాత్మాగాంధీనగర్, వెంగళరావునగర్ తదితర ప్రాంతాల్లోని మున్సిపల్ పాఠశాలల్లో కూడా సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. విద్యావలంటీర్లతో సిలబస్‌ను పూర్తిచేయడానికి అక్కడి ప్రధానోపాధ్యాయులు అష్టకష్టాలుపడుతున్నారు.

కొత్త సిలబస్‌తో తంటాలు
జిల్లాలో 26 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఏడు ఎయిడెడ్ కళాశాలలున్నాయి. దాదాపు అన్ని కళాశాలల్లోనూ ఇంత వరకూ 65 శాతం సిలబస్ కూడా పూర్తికాలేదు. సిలబస్‌ను సకాలంలో పూర్తి చేసి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన ఇంటర్ విద్యాశాఖ ఆలస్యంగా మేల్కొంది. 

జాతీయ స్థాయి పరీక్షలైన నీట్, ఐసెట్ తదితర పరీక్షలకు ఇంటర్ విద్యార్థులను సన్నద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్‌లో ఇంటర్ విద్యాశాఖ మార్పులు తీసుకొచ్చింది. ఆ మార్పులను అధ్యాపకులకు వివరించి వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉండగా ఇన్నాళ్లు ఆ సంగతిని విస్మరించింది. కొందరు అధ్యాపకులు సిలబస్‌ను అర్థం చేసుకోలేక తికమకపడుతూ కొత్త సిలబస్ జోలికే వెళ్లలేదు. మరికొందరేమో పాత సిలబస్‌నే బోధించేశారు. మారిన సిలబస్‌పై బుధవారం నుంచి శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం విచిత్రం. 

సైన్సుకు టీచర్ లేరు
సైన్సు సబ్జెక్టుకు టీచర్ లేకపోవడంతో పాఠాలు పూర్తికాలేదు. విద్యావలంటీర్ సార్ పాఠాలు చెబుతున్నారు. డిసెంబరు నెలాఖరుకల్లా పాఠాలన్నీ అయిపోతాయి. 
శరత్, వేణు, వరిగొండ
జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల 

No comments:

Post a Comment