Wednesday, 5 December 2012

చలో... అరుణగ్రహం!

చందమామ చుట్టూ చక్కర్లు కొట్టిరావొచ్చు...
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతోపాటు కక్ష్యలో విహరించొచ్చు... విదేశాలకెళ్లి వచ్చినట్టుగా అంతరిక్షయాత్రకు వెళ్లిరావొచ్చు... అంతేకాదు...
ఏకంగా అంగారకుడిపైకి వలస వెళ్లి అక్కడే గూడుకట్టుకుని శాశ్వతంగా ఉండిపోవచ్చు కూడా!
మరి మానవజాతికి మరో ‘భూమి’ని అందించేందుకు చేపట్టిన ‘మార్స్ వన్ మిషన్’ సంగతులేంటో చూద్దామా... 


అంగారకుడిపై ఒకప్పుడు నీరు ప్రవహించింది.. జీవం పుట్టుకకు అతికీలకమైన కర్బన మూలకం ఆనవాళ్లనూ క్యూరియాసిటీ రోవర్ ఇటీవలే గుర్తించింది. అయినా.. ఇప్పటికీ మనిషి జీవించే పరిస్థితుల్లేవక్కడ. కానీ... ఇంకో పదేళ్లలోనే అరుణగ్రహంపై నివాసయోగ్యమైన కాలనీ ఏర్పాటవుతుందటున్నారు...‘స్పేస్‌ఎక్స్’ కంపెనీ అధినేత ఎలోన్ మస్క్. అదెలా సాధ్యమన్నదేనా మీ సందేహం... సమాధానాలివిగో...

2023 నాటికి మార్స్‌పై మానవుడికి నివాసయోగ్యమైన స్థావరాన్ని ఏర్పాటుచేయాలన్న ఉద్దేశంతో వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు చేపట్టిన కార్యక్రమమే ‘మార్స్ వన్ మిషన్’. స్పేస్‌ఎక్స్‌తోపాటు అనేక కంపెనీలూ ఇందులో పాలు పంచుకుంటున్నాయి. మార్స్‌పై అన్ని రకాలుగా నివాసయోగ్యమైన స్థావరాలు ఏర్పాటు చేసి, తొలుత పది మందిని, ఆ తరువాత రెండేళ్లకోసారి నలుగురు చొప్పున వ్యోమగాములను పంపించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. మార్స్‌పైకి వలస వెళ్లేవారు శాశ్వతంగా అక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. స్థానిక పరిస్థితులను బట్టి వారే సొంతంగా అవసరాలను తీర్చుకునేందుకు కొత్త ఉపాయాలు ఆలోచించాల్సి ఉంటుంది. మొత్తమ్మీద మానవజాతికి మరో ‘భూమి’ని సష్టించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమన్నమాట.

జాబిల్లికంటే అనుకూలం!

భూమి నుంచి చంద్రుడికి ఉన్న దూరం దాదాపు నాలుగు లక్షల కిలోమీటర్లు. అదే అంగారకుడి విషయానికొస్తే ఈ దూరం సగటున 22 కోట్ల కిలోమీటర్ల వరకూ ఉంటుంది. మరి అంతదూరం కాకుండా ఎంచక్కా చంద్రుడిపైనే కాలనీ ఏర్పాటు చేసుకోవచ్చు కదా? అన్న సందేహం రావడం సహజం. అయితే చంద్రుడితో పోలిస్తే అంగారకుడిపై కాస్త అనుకూల పరిస్థితులు, వనరులు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. గురుత్వాకర్షణ ఎక్కువగా ఉండటం, భూమి మాదిరిగానే రాత్రి, పగటి వేళలు, రుతువులు ఉండటాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. అందుకే శాస్త్రవేత్తలు ఆ గ్రహంపైనే దష్టిపెట్టారు.

ఏడు నెలల ప్రయాణం

ప్రపంచంలోనే అతిపెద్ద రీయూజబుల్ రాకెట్ ‘స్పేస్ ఎక్స్ డ్రాగన్‌పై మనిషి అంగారక యాత్ర మొదలవుతుంది. ఆక్సిజన్, మీథేన్‌లను ఇంధనంగా వాడుకునే ఈ రాకెట్ అంగారకుడిని చేరేందుకు ఏడెనిమిది నెలలు పడుతుంది. అంతకాలమూ స్పేస్‌షిప్‌లో ఇరుక్కుని వెళ్లాల్సిందే. ఫ్రీజ్ చేసిన, కేన్‌లలోని ఆహారంతోనే కడుపు నింపుకోవాలి. అన్నాళ్లూ తడిగుడ్డ స్నానమే. కండరాల ఆరోగ్యం కోసం రోజూ నియమిత సమయంపాటు కసరత్తులు చేయాల్సిందే. మార్గమధ్యంలో సౌర తుపాను వస్తే గనక.. మరింత ఇరుకైన ఓ చిన్న గదిలోకి వెళ్లి తలదాచుకోవాలి. అందులోనే కొన్ని రోజులు కూడా ఉండాల్సిన అవసరమూ తప్పకపోవచ్చు. అయినా.. మార్స్‌పైకి వెళ్లాలని కల కనేవారికి ఈ అవస్థలు పెద్ద ఇబ్బంది కావేమో!

ఇదీ ప్రణాళిక... 

ముందుగా ‘మార్స్ ఒయాసిస్సు’ పేరుతో చిన్న రోబోటిక్ ల్యాండర్‌ను పంపుతారు. చిన్నపాటి గ్రీన్‌హౌస్‌లా ఉండే దీంట్లో అక్కడి మట్టితోనే ప్రయోగాత్మకంగా పంటలు పండిస్తారు. ఫలితాలను బట్టి సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులు కల్పించేవారిని భాగస్వాములుగా చేసుకుని అసలు కార్యక్రమం మొదలవుతుంది. అయితే ఈ యాత్రకు సంబంధించిన పనులు త్వరలో అంటే వచ్చే ఏడాది నుంచే మొదలుకానున్నాయి. మార్స్ రాకెట్ స్పేస్‌ఎక్స్ హెవీలాంఛర్‌ను వచ్చే ఏడాది నుంచి దశలవారీగా పరీక్షిస్తారు. అదేసమయంలో మొత్తం 40 మంది వ్యోమగాములను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించనున్నారు. 2014లో భూమిపైనే మార్స్‌ను పోలిన వాతావరణాన్ని సృష్టించి అక్కడ వీరికి శిక్షణ ఇస్తారు. ఆ తరువాత రెండేళ్లకు మౌలిక వసతుల ఏర్పాటుకు అవసరమైన వస్తువుల రవాణా మొదలవుతుంది.

2018లో తొలి రోవర్ దిగుతుంది. ఆవాసయోగ్యమైన చోటును వెతుకుంది. అది స్వతంత్రంగా పనిచేస్తూ సమాచారం పంపుతుంది. అవసరమనుకుంటే దానిని భూమి నుంచి కూడా నియంత్రిస్తారు. 2021 నాటికి ఆరు వేర్వేరు ల్యాండర్లలో మొత్తం ఆరు యూనిట్లు, రెండు రోవర్లు, ఇతర వస్తువులన్నీ చేరిపోతాయి. 2022 మొదలు నాటికి నీరు, ఆక్సిజన్ వంటివన్నీ సిద్ధమవుతాయి. 2023లో తొలి బందం మార్స్‌పై కాలుమోపుతుంది. క్యాప్సూల్స్ మధ్య కనెక్టింగ్ ట్యూబుల ఏర్పాటు, ఆహార ఉత్పత్తి, సోలార్ ప్యానెల్స్ బిగింపు వంటివి చేసుకుంటారు. కొత్త ‘ఇళ్ల’ను సర్దుకుని కొత్త జీవనం ప్రారంభిస్తారు. కొన్నాళ్లకు మరిన్ని సరుకులు, యూనిట్లు, రోవర్, మరో బందాన్ని వరుసగా పంపుతారు. అయితే, మార్స్ వన్ మిషన్‌లోని ప్రతి ఘట్టమూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. వారి దినచర్యలను కూడా రియాల్టీ షో మాదిరిగా లైవ్‌లో ప్రసారం చేస్తారు.

ఇలా బతకాలి...

స్పేస్‌షిప్‌లో పంపే ల్యాండర్‌లో నివాసం, ఆహారం, గాలి తయారీ, వివిధ సౌకర్యాల కోసం ఐదు యూనిట్లు ఉంటాయి. వస్తువుల రవాణాకు రెండు రోవర్లు ఉంటాయి. బయట తిరిగేందుకు ప్రత్యేక మార్స్ సూట్‌లు ఉంటాయి. అంగారక గ్రహంపై వాటర్ ఐస్‌తో కూడిన మట్టిని మట్టిని వేడి చేయడం ద్వారా నీటిని తయారు చేసుకోవాలి. ఈ నీటినే తాగడానికి, ఆక్సిజన్ తయారీకి, పంటలకు, అన్ని అవసరాలకూ ఉపయోగించాలి. సోలార్ ప్యానెల్స్‌తో విద్యుత్ తయారు చేసుకోవాలి. మార్స్ గాలిలోని నైట్రోజన్ సమద్ధిగా ఉండటమూ కలిసి వస్తుంది (మనం పీల్చేగాలిలో 80 శాతం ఇదే ఉంటుంది). ఎరువులను ఉత్పత్తిచేసే యంత్రాలు, మార్స్ వాతావరణంలోని కార్బన్ డయాకై ్సడ్, నైట్రోజన్‌లను ఉపయోగించి మీథేన్, ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తారు. పారదర్శక గుమ్మటాలను నిర్మించి, వాటి కింద మార్స్ మట్టిపై పంటలు పండిస్తారు. అలా మార్స్ కాలనీలో సౌకర్యాలు పెరిగిన తర్వాత అదే రాకెట్ వెనక్కి వచ్చి మళ్లీ కొత్తవారిని, కొద్దిమొత్తంలో వస్తువులను తీసుకెళుతుంది. తొలుత భూమి నుంచి అత్యవసరమైన పరికరాలు, వస్తువులు, ఆహారం తీసుకెళ్లినా.. తర్వాత అక్కడి పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని అవసరాలు తీర్చుకోవడం, ప్రత్యామ్నాయ ఉపాయాలను ఆలోచించడం వంటివి తప్పవు. రానురాను స్థానిక పరిస్థితులు, పదార్థాలతోనే వికాసం సాధించాలి.
- హన్మిరెడ్డి యెద్దుల 

అంతరిక్షరంగంలోతొలి ప్రైవేటు కంపెనీ... 

దక్షిణాఫ్రికా అమెరికన్ వ్యాపారవేత్త అయిన ఎలోన్ మస్క్ స్థాపించిన ‘స్పేస్‌ఎక్స్’ అంతరిక్ష రవాణారంగంలో అడుగుపెట్టిన తొలి ప్రై వేటు కంపెనీగా చరిత్ర సష్టించింది. ఫాల్కన్-9 హెవీ రాకెట్‌ను కూడా ఇటీవలే విజయవంతంగా ప్రయోగించింది. నాసాకు ప్రధాన వ్యాపార భాగస్వామి అయిన ఈ కంపెనీయే మార్స్ వన్ మిషన్‌లో భాగంగా అంగారకుడిపైకి పరికరాలు, మనుషుల రవాణా చేపట్టనుంది. ఆధునిక టెక్నాలజీ వినియోగంతో అంతరిక్షయానాకియ్యే ఖర్చును భారీగా తగ్గించవచ్చని మస్క్ అంటున్నారు. ఏదో ఒకరోజు అమెరికావంటి దేశాల్లోని సగటు మనిషికి కూడా అంగారకయాత్ర అందుబాటులోకి తే వడం, మార్స్‌పై 80 వేల మందితో ఓ చిన్న పట్టణాన్ని ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమని చెబుతున్నారు.

టిక్కెట్టు... 5 లక్షల డాలర్లు మాత్రమే!

మరో పదేళ్లనాటికి అంగారక యాత్రను ఐదు లక్షల డాలర్ల మొత్తానికే అందుబాటులోకి తీసుకురానున్నామని నిర్వాహకులు అంటున్నారు. అప్పటికిప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంటుందని, లక్షమందిలో ఒకరు సిద్ధమైనా.. 80 వేల మంది అవుతారని అంచనా. మార్స్‌పై ఒక కాలనీ ఏర్పాటుకు మొత్తం 36 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని, వలసవెళ్లే వారంతా ఐదు లక్షల డాలర్ల చొప్పున ఇవ్వగలిగితే 40 బిలియన్ డాలర్లు వస్తాయని అంటున్నారు. 
 

No comments:

Post a Comment