Wednesday, 5 December 2012

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం

నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణిచివేయాలని గుంటూరు రేంజ్ ఐజీ రవికుమార్‌గుప్తా పేర్కొన్నారు. స్థానిక ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాలులో బుధవారం ఆయన పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. దోపిడీలు, దొంగతనాలు ఇటీవల కాలంలో అధికమయ్యాయన్నారు. వాటిని నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. 

దొంగతనాలు, దోపిడీలు జరిగిన తర్వాత కన్నా వాటిని ముందుగానే పసిగట్టి నియంత్రించాలన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గరాదని సూచించారు. బాధ్యతాయుతంగా పని చేసి పోలీసుశాఖ ప్రతిష్టను ఇనుమడింప జేయాలని ఐజీ సిబ్బందికి సూచించారు. పోలీసు అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండి సత్వరమే సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలన్నారు.

ఒత్తిళ్లకు లొగ్గం
పోస్టింగ్‌లు, పదోన్నతుల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేదిలేదని, పారదర్శకంగా నిర్వహించి తీరుతామని ఐజీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని సిబ్బంది గుర్తుంచుకోవాలని రవిగుప్తా సూచించారు. ఎస్పీ బీవీ రమణకుమార్ జిల్లా స్థితిగతులను, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు తీసుకుంటున్న చర్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐజీకి వివరించారు. కోస్తా తీరప్రాంత భద్రతపై ఆయన ఐజీకి వివరించారు.

వ్యాన్‌ప్రారంభం
పోలీసు సంక్షేమ నిధి నుంచి రూ. 3.67లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన టాటా వాహనాన్ని ఐజీ ప్రారంభించారు. ఆ వాహనం పోలీసు గ్యాస్ సరఫరా కోసం వినియోగిస్తామని ఎస్పీ బీవీ రమణకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఎల్‌టీ చంద్రశేఖర్, ఏఆర్ అదనపు ఎస్పీ ఏసీ నాగేశ్వరరావు, నగర, గ్రామీణ, గూడూరు, ఆత్మకూరు డీఎస్పీలు పి. వెంకటనాథ్‌రెడ్డి, బాలవెంకటేశ్వరరావు, సురేష్‌కుమార్, రాజమహేంద్రనాయక్, సీఐలు, పోలీసు అధికారుల సంక్షేమ సంఘ నాయకులు శ్రీహరి, శివ, ఎంటీఆర్‌ఎస్‌ఐ అంకమరావు తదితరులు పాల్గొన్నారు. 

పోర్టులో ఐజీ పర్యటన
ముత్తుకూరు : గుంటూరు రేంజ్ ఐజీ రవికుమార్‌గుప్తా బుధవారం కృష్ణపట్నంపోర్టులో పర్యటించారు. పోర్టు సీఈఓ అనీల్ ఎండ్లూరి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పోర్టులో జరుగుతున్న పనులను ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ఐజీ వెంట ఎస్పీ రమణకుమార్, ఏఎస్పీ చంద్రశేఖర్, రూరల్ డీఎస్పీ బాలవెంకటేశ్వరావు తదితరులు ఉన్నారు. 

No comments:

Post a Comment